Monday, July 8, 2019

కృష్ణ శతకము - బ్రహ్మశ్రీ మంచినీళ్ళ రఘురామ శర్మ

కృష్ణ శతకము
బ్రహ్మశ్రీ మంచినీళ్ళ రఘురామ శర్మ

1
శ్రీ కృష్ణా గోకులహరి
శ్రీ కృష్ణా దేవ దేవ చిన్మయరూపా
నాకవనము నీకిచ్చెద
నీకీర్తిని పొగడుచిపుడు నిజముగ కృష్ణా
2
ముక్కంటి చేతివింటిని
ముక్కలు గావించినట్టిమూర్తినినీకున్
మొక్కెద రఘుకులపతివని
చిక్కెద నీ పాదములకు శ్రీహరికృష్ణా!
3
నల్లనిగొల్లడవయిమరి
యల్లరిసేయుచును.మురిపెమలరారగమల్
చల్లుచు గొల్లల గూడుచు
బిల్లనగ్రోవూది తిరుగు ప్రియ శ్రీ కృష్ణా
4
జేజేలజేజెవని నీ
పూజలుగావింతు నిన్ను బుధులు నుతించన్
జేజేలుసేతునీకున్
రాజితమణిహార నిర్జరాదిత కృష్ణా
5
నా భుయ్యా! నాదుతండ్రీ!
నాయిలుముంగిలివి నివె!నాబ్రతుకీవే!
నాయిలవేల్పునీవే
మాయబడనీక నన్నుమనుపుము కృష్ణా!
6
ముక్కోటి వేల్పుల లెల్లరు
మొక్కగ వైకుంఠ పురిని భుజగేంద్రుపైయిన్
చక్కగ వెలిగెడు నిన్ను
నిక్కముగా గొలుతునయ్య నిష్టను గృష్ణా!
7
గొప్పగు నీ గుణవర్ణన
గొప్పగు నీమేని కాంతి గొప్పగు  పేరున్
కుప్పలుకుప్పలుగా నీ
కొప్పునుగద నీకునీవె గొప్పవు కృష్ణా!
8
నందయశోదానందన!
సుందర సర్వస్వ! భక్త సుందర!వరసక్రందనబింధవ!వరగో
విందా!ముచికుందవరద!వేడెద కృష్ణా!
9
హరివింటిలోని రంగులు,
సురుచిరముగ జిలుకనోటి సూక్తులు,మరిచ
క్కెరలోపలగల మధురము
సురవర!నీనామమందుజూజితి కృష్ణా!
10
ముక్కోటి సురులు భృత్యులు
లేక్కింపగలేని పేర్లు లీలగ వినగన్
అక్కజమగు నీముందర లెక్కెవ్వరు నాకు వినుము శ్రీ హరి! కృష్ణా!
11
ఆత్మవు ననుసాకే పర
మాత్మవు నా హృదయ మనెడి మందిరమున జీ
వాత్మవువేదాంతమున జి
దాత్మవునైనట్టి దలచెద కృష్ణా!
12
జగములలో నీవుందువు
జగములు నీలోననుండు జగదీశ్వర!చి
ర్నగుమొగమున పదునాలుగు
జగములనేలెదవునీవు జయ శ్రీ కృష్ణా!
13
వేదలలు వేయి పేరులు
వేదాల్ వినుతించవేయి వెలిగెడు కన్నుల్
నీదడుగుల వేయియు ని
న్నాదరమున గొలుతులోకనాయక కృష్ణా!
14
కృష్ణా !యని నేబిలుతును
 గృష్ణా!యనిబూజసేతు గృష్ణా!యని నా
తృష్ణ నువీడెద గోకుల
కృష్ణా!నా గతివి నీవె కృష్ణా!కృష్ణా!
15
కంటినీముఖ పద్మము
గంటినినీభక్త జనుల గన్నుంగవతో
వింటిని నీకథలెల్లను
అంటినీ చరణములను అచ్యుత కృష్ణా!
16
నీ రూపము నీకథ నీ
పేరును నీమందిరమును వినుతింపంగన్
వారకౌగాదన్యులు
వారెంతటి వారలైన వారికి కృష్ణా!
17
చూచితినీ యుత్సవముల
జూచితి నీ బంధుజనుల జూచితి సఖులన్
చూచితి నీయాయుధముల
జూచితి నను గరుణ చేతజూడుము కృష్ణా!
18
కమలంబు నీదు వదనము
కమలమునీనాభి, గృహముకమలము కన్నుల్
కమలములు,చరణయుగణము
కమలంబులు నీదుభార్య కమలము కృష్ణా!
18
ఎక్కెదవు పక్షిరాజును
చిక్కెదవోయయ్య విమల చిత్తునకు,సదా
దక్కెదవు మునిజనములకు
మొక్కలనందెదవు మిగుల మురియుచు కృష్ణా!
20
గజ్జెలుఘల్గల్లనగా
ముజ్జగములు మురియు చుండ భుజగోత్తముపై
హజ్జల నుంచియు నాడిన
సజ్జన వాత్సల్య! నన్ను సాకుము కృష్ణా!
21
కట్టెదవు పసిడి బట్టల
గొట్టెదవుసురారిదల,గోరుచు గృపచే
పట్టెదవు కరణ దీక్షను
ముట్టెదవనఘులను నీవు భూమిని కృష్ణా!
22
ధీరుండవు.,సకల జనా
దారుండవు ముక్తినొసగు దైవంబవు ,భూ
భారమ్మును దించు మహా
వీరుండవునైన.నిన్ను వేడెద కృష్ణా!
23
ఉండెదవు భక్తజనులన్
నిండుగనీకరుణచేత నేర్పేర్పడగన్
ఇండించెదవఘరాశిని
దండింతువు దుష్ట. జనుల ధర శ్రీ కృష్ణా!
24
దండము కోదండధరా
దండముసకలాత్మ!వేయి దండబులు మేల్
దండిగ నెల్లరు కిడునిను
గొండాడెద నెపుడు పసిడి కొండా!కృష్ణా!
25
దండము బ్రహ్మాండోదర!
దండము.వేదండవరద! దండము సదయా
దండము ఖండిత దుర్యశ!
దండము బహురూప నీకు దండము కృష్ణా!
26
భువన భయంకరముగ మా
నవ దేహము సింహ ముఖమునై భువిరేయిం
బవలుగాకయు దొడలం
దివిజుం జపియు వెలంగు దేవుడ కృష్ణా!
27
ఒక గర్భంబున నయి వే
 వేరొక గర్భమునందు జేరి  యొప్పుచు నా గేల్
 ఒక కేల రోకలిని వేరొక కేలం దాల్చు రామ రూపిని కృష్ణా!
28
బలి జేరగ నేగి మూడడు
గులనేలన్వేడి పెరిగిగొప్ప గద్రి జగాల్
గొలిచిన మాయా నటుడవు
భలి రే వామన! ముకుంద! బాగుగ కృష్ణా!
29
భూమిని జంకను బెట్టుక హేమాక్షు డు వోవ గోపమేర్పడ వానిన్
భీముడవైజంపియు నీ
భూమిన్ నిలుపిన వరవా! భూధర!కృష్ణా!
30
ఒక్కొక్క గోపిక కు దా
 నొక్కొక్క యశోద  సుతుడ వొప్పగనడుమం
 జక్కగ నాడిన బెం
 పెక్కి న దేవుడవనందు  వినరా! కృష్ణా!
31
అన్నన్న మన్నుదినగా
నిన్నిత్తి విది యేమనంగ నేర్పఢ జగముల్
మున్ను యశోదకు నోటం
గన్నుల.జూపించి నట్టి ఘనుడవు కృష్ణా!
32
గోవుల గాసెడువేళన్
గోపకులసెగలు గుప్పగబోవన్
గోంవింద మ్రింగితివిగద
బ్రోవన్ వనమధ్యమందు భూమిని గృష్ణా!
33
నిరుపేదయు మిత్రుడు భూ
సురుడొక్కడు నిన్ను జేరి చూచెడు వేళన్
హరి! యతనియటుకులన్ గొని
సిరులిడితివి కరుణ జూపి శ్రీహరి కృష్ణా!
34
నిను జూచెద నినుగొలిచెద
నినుదలచద నిన్ను నిలిచెదనెపుడున్
నినుగోరెద నిను వినియెద నిను బూజించెదను నాదు నేర్పున గృష్ణా!
35
కరివరుకొరకురికి నీ
 చరణములొకసారినాకు సరసకు రానీ
దురితముదూరముపోనీ
హరిహరి నిను నమ్మినాడ హరి శ్రీ కృష్ణా!
36
పాలను.వెన్నను బెరుగున్
జాలామీగడల గోప సదనములందున్
నీలాంగ! యారగించిన
వేలుపువని పొగడుచుందు బ్రియముగ కృష్ణా!
37
శివుడవు విష్ణుండవు గురు
డవువాణి పతివి పార్థుడవు నింద్రుండౌ
భువినగ్నివి సూర్యుండవుభవనాశనయన్ని నీవె పావన కృష్ణా!
38
మగచేపవు.తాబేటివి
నఖధర కిటి రూపకుడవు నరహరి ధరా
సురవరుడవు రామత్రయ ధరు
డవు బుద్దుడవు కలికి దైవము కృష్ణా!
39
జగము శృజించగ బ్రహ్మవు జగమేలగహరివినీవు జగములు ముంపన్
జగదీశ్వర యీశ్వరుడవు
జగదాధారక మహాత్మ జయ శ్రీ కృష్ణా!
40
దివిజులలో నింద్రుండవు
భువిజుల భూపాకుడవు భూభుజులందున్
అవనిని శ్రీరాముండవు
నవరసరూపుడవులోక నాయక కృష్ణా!
41
ఛత్రమువలెగోవర్ధన
గొత్రము పైకెత్తి పనులు గోపిలకులన్
మిత్రుడవై  గాచిన లో
కత్రయనాయక!ముకుందఘన శ్రీ కృష్ణా!
42
పర్వేందు బింబవదనా
పూర్వామరవైరి వినుత పుణ్య చరిత్రా
శర్వాజ దివిజ వందిత
సర్వేశ్వర దేవ దేవ!జయశ్రీ కృష్ణా!
43
కళ్యాణ గుణా నేకా
కళ్యాణాకారలోక కళ్యాణ గుణా
కళ్యాణాలంకారా
కళ్యాణ ప్రద మహాత్మ!ఘన శ్రీ కృష్ణా!
44
శృంగార రసగుణార్ణవ
శృంగారాకార లోక.శృంగారకరా
శృంగార రసాభరణా
శృంగారప్రద ముకుంద శ్రీ శ్రీ కృష్ణా!
45
శిరమున మణిమయ మకుటము
గరమున గరమొప్పునభయకరముద్రయునున్
చిరునగవుమొగమునందున
ధరియించినయట్టి నంద తనయా !కృష్ణా!
46
భూమియు నుదకము నీవే
వ్యోమంబవువాయువీవె పుణ్యువీవే
కామునితండ్రివినీవే
కామగనివినీవె సౌఖ్యకర!శ్రీ కృష్ణా!
47
పాలించుము నీవారిని 
దోలిఔచుము దొసగులెల్ల దోర్భల మలరన్
ఆలించుము మామొరలను
నీలీలల జూపి యెపుడు నిజముగ గృష్ణా!
48
కలియుగమున నీనామము
గలిగిన వారెల్ల జావు గలిగిన. వేళన్
నిలుతురుగద కలుని దూ
తలకెదురైభయములేక ధరలో గృష్ణా!
49
రిపులనుజంపగగ వచ్చును
అపరాధుల నెదిరి పోరు లాడగ.వచ్చున్
ఃపటుల గూల్చగ.వచ్చును
కృపనీదుండంగ గృష్ణ! కృష్ణా! కృష్ణా!
50
కొందరు నినుగలవందురు
కొందరులేవంద్రు నిన్ను గుణహీనులు హృ
న్మందిరమందుడుటగన కుందురుగోవింద  దప్పకుందువు కృష్ణా!
51
యోగులు యోగము చే నిను
 భోగులు భోగం బుచేత బొందుదు రెపుడున్
త్యాగాలు ద్యాగాలు చేతన్
నాగోత్తమశయన నందనందన !కృష్ణా!
52
నీవేనీవే యొకపరి
రావే రాకేందువదన రాధా కృష్ణా!
పోవే పాపము లెత్తుక
పోవే పుణ్యాల పుట్ట భువి శ్రీ కృష్ణా!
53
రారా!నా చిన్నన్నా !
రారా! నా తల్లదండ్రి రారా!నాన్నా!
రారా!మా తాతయ్యా!
 రారా నను జూచిపొమ్ము రారా కృష్ణా!
54
నీవేనాధవమందును
నీవేనా ప్రాణమందు నిజమగు బుధ్ధి న్
నీవే నా తనువంతయు
నీవేయిటువచ్చినన్ను నిలుపుము కృష్ణా!
55
ఏరా యిటురావేరా
వీరా నీవేలకరుణ వీడితివౌరా
పోరానీగుణమందును
రారా నా హృదయ మునకు రారా కృష్ణా!
56
నిను విడిచియుండలేనిక
 నను విడువగ రాదుచూడు నయగుణ భరితా
మనమిరువురమొకటైతిమి
జనులేమనుకున్ననేమి జయశ్రీ కృష్ణా!
57
ముక్కోటి సురులకైనను
ముక్కంటి కినైన భుజగ పుంగవుకైనన్
అక్కజమగు  నీగుణముల
లెక్కిం.వశంబె నిన్ను శ్రీ హరి కృష్ణా!
58
ద్వారకలోసభలోపల
శ్రీ రుక్మిణి గూడి
స్వర్ణ సింహాసనమున్
దారూడిగ గూర్చుండిన
నారద నుత నిన్న దలతు నయముగ గృష్ణా!
59
కులమతముల.లేవందురు
కులమునకొకగుంపుగూడి కొర్కెలుమీరన్
బలమున దిరుగగదొడగిరి కులశైలబులను వోలె గోకుల కృష్ణా!
60
మగువలపదియార్వేలకు
మగడవు మన్మథీని గన్న మగవాడవునిన్
దగుదువని కొలుతురెల్లను
సిగయందున పింఛమున్న శ్రీ హరి కృష్ణా!
71
కోమలపల్లవ కరపద
భామా.జన మన్మథా కృపా! భరణా!భూ
భిమాదవ! శాంతస్వాం
తా! మకరధ్వజ జనక జనావన కృష్ణా!
72
నిను విడువనోయి కృష్ణా!
నను విడువకుమోయి నీవు.నావాడవునే
నను నీ వాడవు పరమిడి
నను నీదరి జేర్చు కొమ్మా నరహరి కృష్ణా!
73
శాంతము సత్యము,ధర్మము
సంతోషము, ధైర్యబుధ్ధి , సద్గుణము ,సదా
స్వాంతము నిశ్చల తత్వము
సంతతమిది నీదురూప  సంపద కృష్ణా!
74
భూత పిశాచపు బాధలు
ప్రేతాగ్రహరోగ బాధ లెన్నైన నమః
 ప్రీతిగ నీ నామంబన
భీతిల్లుచు దూరమేగు విను శ్రీ
 కృష్ణా!
75
రణమున బార్థుని రథమును
ఘనముగనడిపించినావు గౌరవముగని
ష్టను బాయూ భగవద్గీ
తనుబోధించితివతనికి దయతో కృష్ణా!
76
ఆనందము నిశ్చల బ్ర
హ్మానందము, పూర్ణ సచ్చిదానందము ,మో
క్షానందము నినుజూజుట
ఓనంద యశోద తనయ ఓ హరి కృష్ణా!
77
పుట్టిన దాదియు మొదలగు
వట్టిగ కాలము గతించె వార్థక్యము జే
పట్టగజూచెను భయమై
ముట్టెద నీ పదయుగంబు బ్రోవుము కృష్ణా!
78
హరిహరుల గూడిరానీ
సురులెల్లరుగూడి వచ్చి చూచినగానీ
మరణముదప్పదు జీవికి
ధరనెప్పటి కైననన్ను దయగొను  కృష్ణా!
79
కోపిష్టిని, రోగిష్టిని,
పాపిష్టిని నన్ క్షమించు బలహీనుండన్
నీపావ బడితినిప్పుడు
కాపాడుము మనసు మార్చి కరుణను కృష్ణా!
80
మును సత్య భామ తన భ
ర్తను నారదునకు నొసంగ రమణీ మణి రు
క్మిణి  దానొక తులసీ దళ
మున గైకొనెనంటనిన్ను బొగడెద కృష్ణా!
81
వామన! కేశవ! గిరిధర!
దామోదర! పద్మనాభ! దనుజారి! హరీ!
ప్రేమవతార! ప్రధ్య
మ్నా !మోక్షాధ్యక్ష !నందనందన! కృష్ణా!
82
మధుసూధనా! త్రివిక్రమ!
రాధా ప్రేమస్వరూప! రాజా నన! మా
నాథా! అథోక్షజా! మ
న్నాథా! అనిరుద్ధ! భక్త నాయక కృష్ణా!
83.
కాకోదర మదభంగా!
నీకుంగై మోడ్ నిన్ను నిష్టను గొలుతున్
నీకే మా సర్వస్వము
మాకొఱకున్నట్టి నిన్ను మానము  కృష్ణా!
84
నల్లనయట నీరూపము,
దేల్లనయట, నీదు నగవు, తేజము, మాటల్
మెల్లనయట, నీ దృష్టియు
జల్లనయట, మనసువెన్న జయ శ్రీ క్రష్ణా!
85
కోమలనీల శరీరా!
రామానుజ!రమ్యచరిత!రగాధిక! సు
త్రామాది దివిజ సన్నుత
నామా!లోకాబిరామ!నరసఖ !కృష్ణా!
86
శ్రీనారాయణ!నరహరి!
మానవవేషా! సుమధుర మంజుల వేషా!
దా నవకులమర్దన!యో
మీనాది దశ స్వరూప మే లిడు కృష్ణా!
87
 మగవలు జలకములాడగ
తగునని వాలువలనుదోచడగునా యిది మే
లగునా నీలీలాలు గని
నగారా యెవరైన గాని నగధర!కృష్ణా!
 88
వందిత సురముని బృందా!
బృందావనచర! మహాత్మా!విమలానందా!
నందాత్మజ!గోవిందా!
బ్రియముగ కృష్ణా!
89
కర్ణాలంకృత కుండల
స్వర్ణాబర! వాసుదేవ!భక్తావన!దు
గ్ధార్ణవమందిర!సుందర
వర్ణిత పదయుగళ!భక్తవత్సల!కృష్ణా!
90
పోనా నీ భక్తుల గన
రానా నీగుడికి నేను రమ్యేo దుముఖా!
ఈనా నామానసమును
చనానీనామ మందు సత్యము కృష్ణా!
91ఎన్నో జన్మల నెత్తితి
ఎన్నోపాపములుజేసి యీజన్మకుని
యన్నా!వచ్చెడి జన్మలు
ఎన్నో ముందుకు నడంచ వేరా!కృష్ణా!
92
దయగల తండ్రివి నివే
నయమార్గముజూపి బ్రోచు నాథుడ కృష్ణా!
భయమునుద్రోచగ గలుగు న
భయముద్రను జూపు భక్త వరదుడ కృష్ణా!
93
నొటనొఋసారి బిలుచుచు
కోటొక్కవరాలగోరుకొందురు మనుజుల్
కూటికి దగు మాటలతో
బూటలుగడపుచును నిన్ను భువిలో కృష్ణా!
94
ఓ యచ్యుత!గోపాలా!
ఓ యనఘ! మురారి!
శౌరి!ఓయదు బాలా
ఓ యనిరుధ్ధ!ముకుందా
ఓ యని నే బిలువ బలుకు మో యని కృష్ణా!
95
ఘన నీల వర్ణదేహా!
ఘనతర చక్ర ప్రశస్త!ఘన విశ్వస్థా
ఘనచంద్ర సూర్యనేత్రా
ఘనమానసహరణ పుణ్య ఘన శ్రీ కృష్ణా!
96
ధ్వజ వ జ్రాంకుశ పాదా
అజ జనక సువర్ణవివిధ వాహ అతి విక్రమ! అం
గజకోటిసుందరాంగా
విజయాప్త విచిత్ర చరిత ప్రీయ శ్రీ కృష్ణా!
97
గరుడధ్వజ! సుకవిస్తుత!
మురళీధర! గోపబాల! పురుషోత్తమ! సుం
ధరధర హాస సువదనా!
అరిభీకర !శాంత సదన హరి శ్రీ కృష్ణా!
98
యాదవకులమణిదీపా!
ఆదియనాదియునీవే యాత్మవునీవే
ఓ దీనాబ్ధి సుధాకర!
సాదర హృదయానుకూల జయశ్రీకృష్ణా!
99
సురవందిత! మృదుచరణా!
కరుణాంబుది! చంద్ర ధర్మ కారణ లోకే
శ్వర శాశ్వత విశ్వంభర!
సురముని జన వినుత భక్త సులభా! కృష్ణా!
100
కారణ కార్యాకారా!
సారసదళనేత్ర! సుజన సంఘ స్తుత్యా!
పారావారవిహారా!
ధీరోత్తమ! దేవ దేవ! ధీనుత! కృష్ణా!
101
నేత్రత్తయసంస్తోత్రా!
చిత్రచరిత్రాతిచిత్ర! చిన్మయగాత్రా!
ఛత్రీకృత !వరగోత్రా!
ధాత్రీధర! నందపుత్ర! తన్మయ కృష్ణా!
102
అమలిన శుభ చరిత్రా!
సుమనస్తుత! పార్థ మిత్ర! సూనృతరూపా!
కమలభవ నమిత చరణా!
కమలాయవక్ష ! సుజనకల్పక కృష్ణా!
103
గురుపుత్రుడు మరణించగ
గురుసేవాదీక్ష బూని గురుతర భక్తిన్
హరినగరి కరిగి తెచ్చిన
హరినీకథ చిత్రముగద హరి శ్రీకృష్ణా!
104
అదయుండగు దుశ్శాసను
డది దుష్టంబన క బాండ వాంగన యగు ద్రౌ
పది వలువ వొలుచు చుండగ
సదయుడవై సాకినట్టి సజ్ఞన కృష్ణా!
105
శారద రాతిరి యమునా
తీరమునంగోపికలకు దేవుడవై శృం
గారమున రాస లీలల
శూరుడవై సలిపినట్టి సుందర కృష్ణా!
106
రారా!యదుకుల నందకు
మారా!హలిసోదరా రమా రమణీశా!
రారా! సుదర్శనాయుధ
రారా! వరఖడ్గ పాణి! రారా! కృష్ణా!
 107
నాయిలు వేలుపు రారా!
నాయిష్ట సఖుండరార! నాన్నా రారా!
మాయామయ యిటురారా!
నా యొప్పులకుప్ప రార! నటవరకృష్ణా!
108
పాదమ్ములపై బడితిని
వేదాలను గన్నయట్టి విదికి జనకుడౌ
నీదరిజేర్చుకొనుమునన్
నీ దయ జూపుచు నునన్ను నిలుపుము కృష్ణా!
109
మరణమయి యముని మందిర
మరుగంగా నతడు పాపమనక దురితముల్
మరిమరిలెక్కించుచునన్
నరకమునంద్రోచుగావు నరవర కృష్ణా!
110
హరి! హరి !మురహరి! నరకా
సురవైరి! కరీంద్రపాల! సురవర మురళీ
 ధర! ధర! ధరణీధర! నరకి
న్నర వరపూజిత పదాబ్జ! నరసఖ! కృష్ణా!
111
బృందారక! బృందార్చిత!
వందీకృతమౌని! బృంద భక్తానందా!
నందకధర!నందార్భక!
సుందర చరణారవింద సూనృత కృష్ణా!
112
నయగుణగణ సంపన్నా!
భయనాశ! యశోద తనయ! భవనాశ! బిలే
శయశయన! తామరసదళ
నయనా!నయమార్గ రూప నటరాట్కృష్ణా!
113
భారద్వాజస గోత్రుండ
పేరున రఘురామ శర్మ వినుమో స్వామీ!
ఉరట చిద్రూపయు నీ
పేరట శతకంబు నిడితి వినుమో కృష్ణా!
114
వలగల్ శంభుని సన్నిధి
విరచించితి నీదుపైన వినుగందములన్
హరిహరులకభేంబని
మరవక నను బ్రోవు కరుణ మానక కృష్ణా!
115
ఈనీతి శతకముమెవ్వరు
దాను వినను జదువ వ్రాయు దయతో వానిన్
క్షోణిని రక్షించుచుదుద
కానీ వైకుంఠమిడుము ఘనముగ కృష్ణా!
116
ధరమాఘ శుద్ధతదియను
మరణించెను.లక్షమాంబ మా జననియు నా
వరవర్ణిని కంకితముగ
విరచించితి నామెకిపుడు విను నీ వురమున్
117
మంగళము మంగళాంగా!
మంగళమోసంగలహిత! మంగళకర!యో
శృంగార విశ్వరూపా
నంగ జనక!కలుష భంగ! నారద వినుతా!
   
ఇయ్యది మెదక్ జిల్లా, సంగారెడ్డి, మండలాంతర్గతంబును జిద్రూపగ్రామ నివాసియు మంచినీళ్ళ వేంకటేశ్వర శర్మ ప్రపౌత్రుండను, రామేశ్వరశర్మ పౌత్రుండను, లక్ష్మమాంబా,వెంకటేశ్వరశర్మ పుత్రుండను రఘురామ శర్మ నామధేయ ప్రణీతంబైన శ్రీ కృష్ణ శతక కావ్యమను గ్రంథంబు
నా జనని యగు లక్ష్మమాంబా చరణా రుణారవింద యుగళంబున సమర్చితంబు సర్వంబు సంపూర్ణంబు.

   గోపాలకృష్ణ భగవాన్ కీ జై,
లోకాసమస్తా సుఖునోభవంతు......